రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోడ్ల పునరుద్దరణ కోసం రూ.644 కోట్లు, ఆన్ గోయింగ్ రెన్యూవల్ పనుల కోసం రూ.322 కోట్లు మొత్తం రూ.966 కోట్ల రూపాయలపై మంత్రివర్గంలో చర్చించి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పిలిచిన టెండర్లు ఫిబ్రవరి చివరి లోపు, మిగితా టెండర్లు ఫిబ్రవరి 10లోపు పూర్తిచేయాలన్నారు. మార్చి 30లోపు వాటికి సంబంధించిన పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఎన్సీలు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఫొటోలతో సహా మంత్రి కార్యాలయానికి రోజువారి నివేదికలు పంపాలన్నారు. పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని.. నాణ్యత లోపించినా... పనుల వేగం తగ్గినా కఠిన చర్యలు తప్పవని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో గుత్తేదారులకు ఆర్డీసీ పనుల కింద చెల్లించాల్సిన సుమారు రూ.800 కోట్లు బకాయిలు అణా పైసతో సహా చెల్లించామని స్పష్టం చేశారు.