Road Works: అనూహ్యంగా పెరుగుతున్న తారు ధరలతో రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల వార్షిక నిర్వహణ భారంగా మారింది. ఒప్పంద సమయానికి తక్కువగా ఉండి పనుల సమయానికి తారు ధరలు హెచ్చడంతో గుత్తేదారులు పనులు చేపట్టడంలేదు. పనులు ఏవైనా ఒకే తరహా నిబంధనను కేంద్రం అమలు చేయకపోవటంతోనే చిక్కులు వస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి చమురు సంస్థలు తారు ధరలను మారుస్తుంటాయి. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ధరల వ్యత్యాసం నిబంధనల మేరకు తారు, సిమెంటు ధరలను పరిగణనలోకి తీసుకుని గుత్తేదారులకు చెల్లింపులు చేసే విధానం ఉంది. చిన్న, పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అన్ని రకాల పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనను అమలు చేస్తుంది. రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టే ఏడాదిలోపు పూర్తి చేయాల్సిన పనులకు మాత్రం కేంద్రం ఒప్పందం నాటి ధరలనే చెల్లిస్తోంది.
పెరిగిన ధరలను ఒకేలా...
ఏడాది పైబడిన అధిక విలువ గల పనులకు పెరిగిన ధరలను కేంద్రం కాంట్రాక్టర్లకు ఇస్తోంది. దీనిని సరిచేయాలని..అన్ని రకాల పనులకు పెరిగిన ధరలను ఒకేలా వర్తింపజేయాలంటూ వినతి పత్రాలు ఇచ్చినా కేంద్రం పట్టించుకోవటం లేదని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) తెలంగాణ శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. రూ.20 కోట్ల లోపు వ్యయంతో చేపట్టే నిర్వహణ పనుల్లోనూ తారు అవసరం 50 - 70 శాతం ఉంటుందని అధికారులు అంగీకరిస్తున్నారు.
తారు ధరలు అనూహ్యంగా పెరగటంతో అధిక ధరలకు దక్కించుకున్న గుత్తేదారులు పనులను నత్తనడక సాగిస్తున్నారు. తక్కువ మొత్తానికి టెండరు దక్కించుకున్న గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు. పర్యవసానంగా గుంతల రహదారులపై ప్రయాణికులకు అవస్థలు తప్పడంలేదు.