Road Accident at Komarada Today : ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వారంతా అప్పటివరకు ఒకరినొకరు పలకరించుకుంటూ ఓ వివాహా వేడుకలో ఆనందంగా గడిపారు. పెళ్లికి హాజరైన బంధువులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొన్నారు. భోజనం చేసి అనంతరం వివాహానికి హాజరైన బంధువులకు వెళ్లి వస్తామని చెప్పి బయలుదేరారు. అప్పటివరకు ఆటోలో పెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటూ సందడిగా గడిపారు. పెళ్లికి సంబంధించిన జ్ఞాపకాలలో ఉన్న వారిని దురదృష్టవశాత్తు విధి చిన్నచూపు చూసింది. అదే వారికి చివరి ప్రయాణమయ్యేలా చేసింది. వాళ్లు ప్రయాణిస్తున్న ఆటోను ఒక్కసారిగా వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
కోమరాడ మండలం అంటివలసకు చెందిన వారంతా బంధువుల పెళ్లికి వస్తున్నారు. వివాహానంతరం బయలు దేరి వస్తున్న వారి ఆటోను మార్గమధ్యలో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కొమరాడ మండలం చోళపదం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో నలుగురికి గాయాలు కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా కోమరాడ మండలం అంటివలసకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.