పరవళ్లు తొక్కుతున్న నదులు... నిండుకుండల్లా జలాశయాలు రాష్ట్రంలో నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి జలాశయాలన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. నదులన్ని పరుగులు పెడుతున్నాయి.
కుమురంభీం జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కుమురం భీం, వట్టివాగు ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంది. పెద్ద ఎత్తున వస్తున్న వరదలను దృష్టిలో పెట్టుకుని స్పిల్వే 3 గేట్లను మూడు అడుగుల మేరకు ఎత్తి నీటిని వదిలారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 241.1 మీటర్లకు చేరింది.
ఎల్లంపల్లికి పొటెత్తిన వరద...
మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి 190. 96 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుకోగా... 7.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు ఇప్పటికే 142.3 మీటర్లకు నీరు చేరుకుంది. నీటి ప్రవాహం కొనసాగుతున్నందున అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
నిండుకుండలా కడెం జలాశయం...
నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి జలాశయం నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా... ప్రస్తుతం 693.6 అడుగులకు చేరుకుంది. పెద్ద మొత్తంలో వరద నీరు చేరుకోవటం వల్ల గేట్లన్ని ఎత్తి 52,800 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.
కాళేశ్వరంలో జలసిరుల కళకళ...
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. వరద నీరు సాధారణ ఘాట్ మెట్లు తాకుతూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 7.55 మీటర్ల మేర నీటి ప్రవాహం ఉంది. త్రివేణి సంగమం వద్ద ఉభయ నదులు ప్రవహించడం వల్ల ముందస్తుగా ఘాట్ వద్ద కంచె ఏర్పాటు చేశారు. భక్తులు నది లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ 31 గేట్లు ఎత్తివేత...
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. రాత్రి నుంచి వరద ప్రవాహం పెరగటం వల్ల 31 గేట్లను ఎత్తి... నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో పాటు.. ఉపనదుల వెంట భారీగా నీరు వచ్చి చేరటం వల్ల మేడిగడ్డ దగ్గర గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
భద్రాచలం వద్ద గోదావరి పవవళ్లు...
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తోన్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు 41 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. స్నానాలఘాట్ మునిగిపోయింది. ప్రస్తుతం 41అడుగుల ఉన్న నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జూరాల నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు...
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. జూరాల నుంచి శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడం వల్ల దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు . జూరాల సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.678 టీఎంసీల నీరు నిల్వ ఉంది. స్పిల్ వే గేట్ల ద్వారా 98 వేలు 668 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి: మరో నాలుగైదు రోజులపాటు మోస్తరు వర్షాలు...!