తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లోనూ ఆయువు తీసే వాయువులెన్నో? - తెలంగాణ కాలుష్య నియంత్రణ’ మండలి

ఆయువు తీసే వాయువులను నిత్యం మనమూ పీలుస్తున్నాం. విషవాయువులను వెదజల్లే వందలకొద్దీ పరిశ్రమలు భాగ్యనగరం చుట్టూ విస్తరించి ఉన్నాయి. ఆ పరిశ్రమల నుంచి వెలువడే టన్నులకొద్దీ రసాయన వ్యర్థాలను ఆ పరిసరాల్లో, కాలువల్లో గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రుళ్లు వదులుతుంటారు నిర్వాహకులు. ‘కాలుష్య నియంత్రణ’ మండలి పేరుకే పరిమితమైంది. తాజాగా విశాఖ ఘటన నేపథ్యంలోనైనా అప్రమత్తం కావాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

risk-companies-around-the-hyderabad-city-dot-where-is-the-pcb-surveillance
హైదరాబాద్​లో జీవితం... కాలుష్యంతోనే సహజీవనం

By

Published : May 8, 2020, 8:18 AM IST

Updated : May 8, 2020, 8:23 AM IST

హైదరాబాద్​ నగరం చుట్టూ 5 వేల నుంచి 6 వేల వరకు వివిధ పరిశ్రమలుంటాయి. ఫార్మా, రసాయన పరిశ్రమలు.. జీడిమెట్ల, బాచుపల్లి, నాచారం, చర్లపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్‌, పాశమైలారం, ఐడీఏ బొల్లారం, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.

ప్రమాదం జరిగినప్పుడే చర్యలు...

ఒక్క జీడిమెట్లలోనే 60 రసాయన పరిశ్రమలున్నాయి. నిత్యం ఏదో పరిశ్రమలో అగ్నిప్రమాదమో లేదా గ్యాస్‌ లీక్‌ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పీసీబీ ప్రాంతీయ కార్యాలయాల్లో కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ), కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ (సీఎఫ్‌వో) తదితర అనుమతుల జారీతోనే అధికారులు మమ అనిపించేస్తున్నారు. తనిఖీల సంగతే మరిచారు. ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేసి ఆ తర్వాత అటువైపే చూడటం లేదు.

అత్యంత ప్రమాదకరమైన రెడ్‌ కేటగిరీ పరిశ్రమల్లో రియల్‌ మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) ఆదేశించింది. ఎక్కడ తమ గుట్టు రట్టవుతుందోనని నిర్వాహకులు ఒత్తిడి తేవడం వల్ల అధికారులు వెనక్కి తగ్గారు.

కనీస సమాచారమూ కరవే...

ఏ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలున్నాయి.. ఎన్నింటికి అనుమతులున్నాయి.. సీఎఫ్‌వోను పునరుద్ధరించుకున్నారా.. లేదా.. ఏం ఉత్పత్తి చేస్తున్నారు. సీపీసీబీ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా..? అనే కనీస సమాచారం కూడా పీసీబీ అధికారుల దగ్గర లేదంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని పరిశ్రమలు ఒకదానికి అనుమతి తీసుకుని మరొకటి ఉత్పత్తి చేస్తున్నాయి. చాలా పారిశ్రామికవాడల్లో పరిశ్రమలకు కనీసం బోర్డులు కూడా ఉండవు. జీడిమెట్ల, దూలపల్లి ప్రాంతాల్లో అనుమతుల్లేని రసాయన గోదాముల్లో ఎన్నిసార్లు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నా పట్టించుకునే నాథుడే లేరు.

వెయ్యి నుంచి 2 వేల వరకు...

ఓఆర్‌ఆర్‌ లోపల 5 వేలకుపైగా పరిశ్రమలుంటే అనుమతుల్లేనివి 1000-2000 వరకు ఉంటాయని పర్యావరణవేత్తలు వివరిస్తున్నారు. నిషేధిత ఔషధాలు, డ్రగ్స్‌ తయారు చేస్తూ గాల్లోకి విషవాయువులు, పరిసరాల్లోకి రసాయన వ్యర్థాలను వదిలేస్తున్నారు.

ప్రశాంత్‌నగర్‌, అలిపిరి (కూకట్‌పల్లి), బాచుపల్లి, బౌరంపేట్‌, జీడిమెట్ల, చర్లపల్లి, మల్లాపూర్‌, నాచారం, హయత్‌నగర్‌, తుర్కయాంజాల్‌, ఉప్పల్‌, మౌలాలి, మైలార్‌దేవ్‌పల్లి, గాంధీనగర్‌, మూసాపేట, మియాపూర్‌ పారిశ్రామికవాడల్లోని అధికశాతం పరిశ్రమలు అనధికారికంగానే కొనసాగుతున్నట్లు పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

Last Updated : May 8, 2020, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details