Rising Temperatures in Telangana : రాష్ట్రంలో మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తుతున్నారు. పలుచోట్ల 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవటం ఆందోళనకు గురిచేస్తోంది. సూర్యాపేట జిల్లా మునగాలలో గరిష్ఠంగా 45.2, నల్గొండ జిల్లా దామరచర్లలో 45.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తంగులలో 44.9, కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడులో 44.8, నల్గొండ జిల్లా పజ్జూరు, కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 44.7డిగ్రీలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి, నల్గొండ జిల్లా మామిడాలలో 44.5డిగ్రీలు, సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్‌లో 44.3, ఖమ్మం జిల్లా ఖానాపూర్, కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నం, మహబూబాబాద్ బయ్యారంలో 44.2డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బయటకు రావాలంటేనే భయంగా: సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ కావటంతో మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఆరు బయట పనులు చేసే వారు, భవన నిర్మాణ కార్మికులు, ప్రయాణికులు, అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత భారీగా పెరగడంతో భయటకు రావాలంటనే ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం 8గంటలకే భానుడి భగభగలు ప్రారంభమవుతుండగా.. మిట్ట మధ్యాహ్నం మరింత మండిపోతున్నాయి. పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాలోని పలుప్రాంతాలు నిప్పుల కొలమిలా మారుతున్నాయి.
"ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాలు.. ఉత్తర, ఈశాన్య, సెంట్రల్ జిల్లాల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయి. దక్షిణ ప్రాంతంలో కొంత తక్కువగా ఉన్నాయి. గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు 41డిగ్రీల పైనే ఉండొచ్చని ఉత్తర, ఈశాన్య, సెంట్రల్, తూర్పు జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో వడగాలులు అనేవి వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు మాత్రం రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది.చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవాళ్లు, రోజువారి కూలీలు మంచి ప్రదేశాలలో ఉండాలి. అధికంగా ద్రవ పదార్థాలను తీసుకోవాలి."_నాగరత్న, సంచాలకులు, హైదరాబాద్ వాతావరణ శాఖ