రాష్ట్రంలో చిన్నారులపై లైంగికదాడుల కేసులు ఏటికేడూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో పిల్లలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఈ బెడద మరింత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, స్నేహితులే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండటంతో అడ్డుకోవడం ఎలాగో తెలియక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. 2014లో బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద 938 కేసులు నమోదు కాగా గత ఏడాది (2020) నాటికి దాదాపు మూడింతలు పెరిగి 2,626 రికార్డయ్యాయి. ఈ ఏడాది ఇంకాస్త పెరిగి మొదటి ఏడు నెలల్లోనే 1750కి చేరుకున్నాయి. రాష్ట్రంలో మిగతా నేరాలు తగ్గుతున్నా, సైబర్‌నేరాలు, మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల్లో పెరుగుదల నమోదవుతోంది.
పరిచయస్తులతోనే ప్రమాదం..
పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఎదుటి వ్యక్తి దురుద్దేశాలను అర్థం చేసుకుని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు.అవసరమైతే తల్లిదండ్రుల సాయం తీసుకుంటారు. కానీ అవేమీ తెలియని పసిపిల్లలకు దుండగులు చాక్లెట్ల వంటివి ఆశ చూపించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వరంగల్‌లో తల్లి వద్ద నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిగుడ్డును ప్రవీణ్ అనే ఉన్మాది అపహరించి చిన్ని ప్రాణాన్ని చిదిమేశాడు. గత జులైలో ఒడిశాకు చెందిన అభిరామ్‌దాస్ అనే వ్యక్తి జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 99.7 శాతం కేసులలో చిన్నారులపై తెలిసిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కన్నతండ్రే బిడ్డలపై లైంగికదాడికి తెగబడుతున్నాడు. గత ఏడాది మే నెలలో దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 45 ఏళ్ల తండ్రి 12 ఏళ్ల కూతురిపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది జులై నెలలో కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఉన్న తండ్రి 16 ఏళ్ల తన కుమార్తెపై అత్యాచారానికి ప్రయత్నించగా తల్లి అడ్డుకుంది.
మాదకద్రవ్యాలతో ఉపద్రవం..
సైదాబాద్ ఘటనలో నిందితుడు రాజు వ్యసనాలకు బానిసయ్యాడు. గంజాయి మత్తులోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వరంగల్ నిందితుడు ప్రవీణ్ ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడు. కాచిగూడలో కన్నబిడ్డపై అత్యాచారయత్నం చేయబోయిన తండ్రి కూడా మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో పెరుగుతున్న మత్తుపదార్థాల వినియోగం ఇలాంటి అకృత్యాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మారుమూల ప్రాంతాల్లో మాత్రమే పరిమితంగా చలామణి అయిన గంజాయి తదితర మాదకద్రవ్యాలు ఇప్పుడు కాలనీల్లోకీ చొచ్చుకొచ్చాయి.
అప్రమత్తతతోనే రక్షణ..