Red Chilli Price : తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పంట పోటెత్తుతోంది. మిరప క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం మిర్చి క్వింటాల్ ఏకంగా రూ.22వేలు పలికింది. ఇది రికార్డు స్థాయి ధర కావడం విశేషం. గత రెండు మూడేళ్లలో మిర్చి పంటకు ఈ స్థాయిలో మద్దతు ధరలు దక్కలేదు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, కర్నూలు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి... రెండోసారి ఏరిన పంట రాకతో ధర ఒక్కసారిగా పెరిగింది.
గదేడాది రూ.13వేలే..
గతేడాది ఇదే సమయంలో ఘాటు రకం మిరప క్వింటాల్ ధర రూ.13వేలు మాత్రమే పలకగా... ఈసారి 22 వేలకు చేరింది. ఇన్నేళ్లుగా మిరప సాగుచేస్తున్నా.... ఎప్పుడూ ఇంత ధరలు చూడలేదని రైతులు అంటున్నారు. మరోవైపు పెరిగిన పెట్టుబడులు, జరిగిన నష్టం, తగ్గిన దిగుబడులతో పోల్చుకుంటే.... మార్కెట్లో లభించే ఈ ధరలతో పెద్దగా లాభం లేదని... అన్నీ తీసేస్తే చేతికి ఏం మిగలడం లేదని రైతులు అంటున్నారు.
గతంలో ఒక ఎకరాకు 30 క్వింటాలు దిగుబడి వచ్చేది.. ఇప్పుడు పది క్వింటాలే వస్తుంది. ఇప్పుడున్న ధరల వల్ల భారీ లాభాలు అయితే రావుకాని.. నష్టం మాత్రం రాదు. ధరలు పెరగడం సంతోషంగా ఉంది. -మిర్చి రైతు