తెలంగాణ

telangana

ETV Bharat / state

Afghanistan crisis: అఫ్గానిస్థాన్‌ ప్రభావంతో పెరిగిన డ్రై ఫ్రూట్స్ ధరలు

ఎండు పండ్ల ధరలపై అఫ్గానిస్థాన్‌ ప్రభావం పడనుంది. తాలిబన్ల వశమైన ఆ దేశం నుంచి ఎగుమతులను ప్రస్తుతానికి నిషేధించారు. మన దేశానికి వాల్‌నట్స్‌, అప్రికాట్‌, అంజీర్‌, పైన్‌నట్స్‌ ఈ దేశం నుంచి దిగుమతి అవుతాయి.

rising-dried-fruit-prices-under-the-influence-of-afghanistan
ఎండు పండ్ల ధరలకు రెక్కలు.. అఫ్గానిస్థాన్‌ ప్రభావంతో ఆగిన దిగుమతులు

By

Published : Aug 21, 2021, 9:06 AM IST

Updated : Aug 21, 2021, 7:04 PM IST

తాలిబన్ల ఆక్రమణలతో అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితులు భారత్‌పైనా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతులపై తాలిబన్లు నిషేధం విధించడంతో మన దేశంలో డ్రై ఫ్రూట్స్‌ ధరలకు రెక్కలొస్తున్నాయి. అసలే కరోనా వేళ.. ఆపై రాబోయేది పండగ సీజన్‌.. ఇలాంటి సమయంలో సరఫరా నిలిచిపోవడంతో కొద్ది రోజులుగా ఎండుఫలాల ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

85 శాతం అక్కడి నుంచే దిగుమతి..

బాదం, పిస్తా, అంజీర్‌, ఆప్రికాట్‌ వంటి పంటలకు అఫ్గానిస్థాన్‌ పెట్టింది పేరు. మన దేశంలో దిగుమతి అయ్యే మొత్తం డ్రై ఫ్రూట్స్‌లో 85శాతం అక్కడి నుంచే వస్తాయి. అయితే ఇప్పుడు అఫ్గాన్‌ను వశం చేసుకున్న తాలిబన్లు.. భారత్‌తో ఎగుమతులు దిగుమతులు నిలిపివేశారని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్ తెలిపింది. అక్కడి నుంచి వచ్చే కార్గో రవాణాను నిలిపివేసినట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా భారత్‌కు అఫ్గాన్‌ నుంచి డ్రైఫ్రూట్స్‌ దిగుమతులు రాకపోవడంతో వాటి ధరలపై తీవ్ర ప్రభావం పడుతోందని‌ ఎఫ్‌ఐఈవో ఆందోళన వ్యక్తం చేసింది. దిగుమతుల బడ్జెట్‌ రూ.3,753 కోట్లలో ఎండు ఫలాల వాటానే రూ.2,389 కోట్లు ఉంటుంది. కరోనా సమయంలో ఎండు పండ్ల వినియోగం భారీగా పెరిగింది. దిగుమతులు ఆగిపోవడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రభావం ఇతర డ్రై ఫ్రూట్స్‌పైనా పడుతుందని టోకు వ్యాపారి రాజూభాయ్‌ చెప్పారు.

పెరిగిన డ్రై ఫ్రూట్స్ ధరలు...

బేగంబజార్‌లోని టోకు విపణిలో ఏప్రిల్‌లో నాణ్యమైన అంజీర్‌ ధర కిలో రూ.1350 ఉండగా, ప్రస్తుతం రూ.1400-1450 వరకు పలుకుతోంది. వాల్‌నట్స్‌ రూ.1400 ఉండగా.. ప్రస్తుతం రూ.1499 వరకూ ఉంది. అప్రికాట్‌ కిలో రూ.550 ఉండగా, ప్రస్తుతం రూ.750కి చేరింది. బాదం నాణ్యమైన రకం నెల క్రితం కిలో రూ.950 ఉండగా, ప్రస్తుతం రూ.1330కి విక్రయిస్తున్నారు. మిగతావీ కిలోకి రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగాయి.

ఇదీ చూడండి:NEW MUNICIPALITIES: ప్రగతికి దూరంగా 69 కొత్త మున్సిపాలిటీలు

Last Updated : Aug 21, 2021, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details