తెలంగాణ

telangana

ETV Bharat / state

రిషితేశ్వరి కేసు ఆరు నెలల్లోపు తేల్చాలి: ఏపీ హైకోర్టు - రిశితేశ్వరి ఆత్మహత్య

నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య కేసును పోక్సో చట్టం కిందే పరిగణించాలంటూ ఏపీ హైకోర్టు  స్పష్టం చేసింది.ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందితులపై పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రాన్ని గుంటూరులోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్​ న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది.

rishiteshwari-case-must-be-settled-within-six-months-says-high-court
రిషితేశ్వరి కేసు ఆరు నెలల్లోపు తేల్చాలి: ఏపీ హైకోర్టు

By

Published : May 15, 2020, 7:48 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య కేసును పోక్సో చట్టం కిందే పరిగణించాలంటూ ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రకారం పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీటును స్వీకరించి, ఆరు నెలల్లోపు తేల్చాలని పోక్సో ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందితులపై పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రాన్ని గుంటూరులోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. లైంగిక వేధింపులకు గురైన సమయంలో ఆ యువతి మైనరేనని, పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారని గుర్తుచేసింది.

లైంగిక వేధింపులు తాళలేక వరంగల్‌కు చెందిన రిషితేశ్వరి వర్సిటీ వసతిగృహంలో 2015 జులై 14న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె సీనియర్లైన నాగలక్ష్మి, చరణ్‌నాయక్‌, ఎన్‌.శ్రీనివాస్‌, ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బాబురావుపై ఐపీసీ, ర్యాగింగ్‌ చట్టాలతో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక పోక్సో ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. 2015 జులై 14న ఆత్మహత్య ఘటన చోటు చేసుకుందని, మృతురాలు అప్పటికి మేజరని, ఆ యువతి నిందితులపై ఎలాంటి రిపోర్ట్‌ చేయలేదని కారణాలు చూపుతూ పోక్సో కోర్టు అభియోగపత్రాన్ని తిప్పిపంపింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ మృతురాలి తండ్రి 2017లో హైకోర్టును ఆశ్రయించారు. ‘రిషితేశ్వరి 1997 ఏప్రిల్‌ 24న జన్మించారు. 2014 సెప్టెంబర్‌ 07న ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరారు. మైనర్‌గా ఉన్న సమయం 2014 సెప్టెంబర్‌ నుంచి 2015 ఏప్రిల్‌ వరకు వేధింపులకు గురయ్యారు. వేధింపులు తట్టుకోలేక 2015 జులై 14న(మేజర్‌) వసతిగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మైనర్‌గా ఉన్నప్పుడే వేధింపులకు గురయ్యారు కాబట్టి పోక్సో చట్టం వర్తిస్తుంది’ అంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు.

ఇదీ చదవండి:'దిశ' చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details