Telangana Rains :నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు సోమవారం రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో ప్రవేశించాయి. బుధవారానికల్లా మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచాయి. గతేడాది జూన్ 5న వచ్చిన నైరుతి.. ఈ ఏడాది అంతకన్నా వారం ఆలస్యంగా 13న రాష్ట్రాన్ని తాకింది. సాధారణంగా ఈ నెల 8 నాటికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, అంతకన్నా అయిదు రోజులు ఆలస్యంగా వచ్చాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో సికింద్రాబాద్లోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. గత కొన్నాళ్లుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన భాగ్యనగర వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది.. ఒకసారి కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా అరగొండ (కామారెడ్డి జిల్లా)లో 9.7 సెంటీమీటర్లు, మల్లారం (జయశంకర్)లో 7, మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 6.8, నీల్వాయిలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్గొండ, ఖమ్మం జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వేసవి ఎండల తీవ్రత తగ్గింది. సోమవారం అత్యధికంగా ఖమ్మం జిల్లా మధిరలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.