మొదటి నుంచి తనను వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత హనుమంతు రావును నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. అనారోగ్యంతో హైదర్‌గూడ అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసి పరామర్శించారు. రేవంత్ రెడ్డితోపాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిలు వీహెచ్ ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు.
ఉదయం.. మాజీ మంత్రి చిన్నా రెడ్డి మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. అనంతరం అక్కడ నుంచి ఆసుత్రికి వెళ్లి వీహెచ్‌ను పరామర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల పాలిట ద్రోహి అయిన కేసీఆర్‌తో అందరం కలిసి కొట్లాడదామని వీహెచ్‌తో చెప్పినట్లు రేవంత్ తెలిపారు. ఆరోగ్యం కుదటపడగానే తాను హనుమంతరావును దిల్లీకి తీసుకెళ్లి సోనియా, రాహుల్ గాంధీలతో కలుపుతానని తెలియజేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రెండు సంవత్సరాలల్లో...ఏ విధంగా కొట్లాడాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తామని, పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు విషయమై కచ్చితమైన కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నట్లు వీహెచ్‌కు తెలియజేసినట్లు వివరించారు.