కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల(Krishna River Management Board, Godavari River Management Board)తో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష ముగిసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో హైదరాబాద్ జలసౌధలో కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమావేశమయ్యారు. రెండు బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిని సమీక్షించారు. కార్యాచరణ పురోగతిని వివరించిన ఛైర్మన్లు... రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు అందిన సమాచారం, వివరాలను కేంద్ర అదనపు కార్యదర్శికి తెలిపారు.
కేంద్ర జలశక్తిశాఖ జులై 15న జారీ చేసిన నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి రావల్సి ఉంది. ఈలోగా అందుకు సంబంధించి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే రెండు రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం ఇంకా బోర్డులకు అందలేదు. నిర్వహణ కోసం కావాల్సిన సమాచారం కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్‌లోని కొన్ని ప్రాజెక్టులను రెండో షెడ్యూల్ నుంచి తొలగించాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమలు కార్యాచరణ దిశగా ఇప్పటి వరకు జరిగిన కసరత్తు, రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం సహా అన్ని అంశాలపై దేబశ్రీ ముఖర్జీ.. బోర్డులతో పూర్తి స్థాయిలో సమీక్షించారు. సమీక్ష ఆధారంగా దేవశ్రీ ముఖర్జీ కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనున్నారు.