కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్... ఈ నెల 14నుంచి అమల్లోకి రానున్న వేళ, కేంద్రం.. నేరుగా రంగంలోకి దిగింది. కేంద్ర జల్‌శక్తిశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ గురువారం హైదరాబాద్ వచ్చి రెండు బోర్డుల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకూ నిధులు ఇవ్వకపోవడం సహా వివరాలు పూర్తిగా సమర్పించని నేపథ్యంలో... ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆమె కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లతో చర్చించినట్లు తెలిసింది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కొన్ని ప్రాజెక్టులైనా... బోర్డుల అధీనంలోకి తీసుకోవడంపై చర్చించినట్లు సమాచారం. మొదట జలసౌధలో కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎం.పి.సింగ్, గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో సమావేశమైన ఆమె... తర్వాత రెండు బోర్డుల మెంబర్ సెక్రటరీలు, సభ్యులతో భేటీ అయ్యారు. కృష్ణా బోర్డు తరఫున రవికుమార్ పిళ్లై, గోదావరి బోర్డు నుంచి పాండే గెజిట్ అమలుపై ఇప్పటివరకు ఏం జరిగిందో ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టుల సిబ్బంది, కార్యాలయాలు, అక్కడున్న యంత్రాలు, వాహనాల వివరాలను రాష్ట్రాలు అందజేయాల్సి ఉండగా, అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్పించారు. తెలంగాణ నుంచి ఇంకా రావాల్సి ఉందని నివేదించినట్లు సమాచారం.
సానుకూల స్పందన లేదు..
ఒక్కో బోర్డుకు ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్లు సీడ్‌మనీగా ఇవ్వాల్సి ఉండగా ఇంత మొత్తం ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదని గత బోర్డు సమావేశంలోనే తేల్చిచెప్పాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బోర్డుల నిర్వహణకు కేటాయించిన నిధులు కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలన్నదానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్వహణలో భాగంగా సీఐఎస్ఎఫ్ బలగాల మోహరింపుపైనా... చర్చించారని సమాచారం. కార్యాలయాలు, సిబ్బంది ఉండేందుకు క్వార్టర్లు, వాహనాలు, జీతభత్యాల కోసం ఏడాదికి సుమారు రూ.150 కోట్లు అవసరం. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన లేదని అధికారులు కేంద్ర అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఈ సమావేశం తర్వాత దేవశ్రీ ముఖర్జీ తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌ను కలిసి గెజిట్ అమలుకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. తెలంగాణ అభిప్రాయాలను రజత్ కుమార్ వివరించినట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్‌లోని కేంద్ర జల సంఘం కార్యాలయం అధికారులతోనూ ఆమె సమావేశమయ్యారు. కేంద్ర జలసంఘం కార్యాలయం నుంచి 18 మంది, హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయం నుంచి 18 మంది అధికారులను మూడు నెలల పాటు బోర్డులకు అటాచ్ చేశారు. ఇందులో కొందరిని శ్రీశైలం ఎగువ ప్రాజెక్టులకు, కొందరిని దిగువ ప్రాజెక్టులకు కేటాయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అటు ఈ నెల12న అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు కృష్ణా, గోదావరి బోర్డులు ప్రకటించాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇచ్చాయి. నోటిఫికేషన్ అమలు, కేంద్రం, రెండు రాష్ట్రాల నుంచి బోర్డులకు డిప్యుటేషన్‌పై వచ్చే ఇంజినీర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఇచ్చే అంశాలను ఎజెండాలో చేర్చారు. అత్యవసర భేటీకి ముందు ఆది, సోమవారాల్లో ఉపసంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బోర్డుల సమావేశం తర్వాత కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి:krmb:ఈ నెల 12న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం