Harish Rao Review On Hospitals: టీవీవీ ఆసుపత్రుల నెలవారీ పనితీరుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూలో పలు అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు అతనికి అవసరమైన అన్ని మందులు ఉచితంగా ఇచ్చి పంపాలని ఆదేశించారు. గర్భిణిలకు చికిత్స విషయంలో అసలు ఆశ్రద్ద వద్దని తెలిపారు. వారికి టిప్ఫా స్కానింగ్ పరీక్షలు కూడా ఇకనుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించాలని చెప్పారు. కొత్త మెషిన్లు వచ్చేలోపు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రుల్లో టీ డయాగ్నోస్టిక్ సేవలు పొందిన వారికి.. 24 గంటల్లోనే వారి మొబైల్ ఫోన్లకు పరీక్ష ఫలితాల సమాచారం అందేలా చూడాలని హరీశ్ రావు తెలిపారు. రాత్రి వేళ్లలో పోస్ట్‌మార్టం కార్యకలాపాలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు వారి సహాయకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
శానిటేషన్, డైట్ మెరుగుపడాలి: శానిటేషన్, డైట్ మెరుగుపడాలని వారి బిల్లులు, వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేయరాదని అధికారులకు హరీశ్ రావు సూచించారు. శానిటేషన్, డైట్ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి వైద్యాధికారికి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. వైద్య విధాన పరిషత్తులోని ఆసుపత్రుల్లో కొన్ని చోట్ల స్పెషలిస్టు డాక్టర్లు ఎక్కువ సంఖ్యలో ఉండి.. మరి కొన్ని ఆసుపత్రులో లేని పరిస్థితి ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేయాలి: అవసరం ఉన్న చోట డిప్యుటేషన్‌పై డాక్టర్లను పంపి వైద్య సేవలకు ఇబ్బందులు లేకుండా చూడాలని హరీశ్ రావు తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ యూనిట్లో ఇన్పెక్షన్ ఆఫీసర్‌ను, నర్సును ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆపరేషన్ థియేటర్ల నిర్వహణపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.