Telangana Revenue: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 70 వేల 126 కోట్ల రూపాయల పన్నుఆదాయం సమకూరింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ. లక్షా 26 వేల 606 కోట్ల పన్నుఆదాయంలో ఇది 55. 39 శాతం. అక్టోబర్ నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై ఆర్థికశాఖ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్‌కు నివేదిక సమర్పించింది. జీఎస్టీ ద్వారా రూ. 23 వేల 493 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ. 17 వేల 329 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ. 10 వేల 320 కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 8 వేల 238 కోట్లు ఖజానాకు చేరాయి.
పన్నేతర ఆదాయం రూ. 8 వేల 796 కోట్లు: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ. 5 వేల 911 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ. 4 వేల 832 కోట్ల రూపాయలు వచ్చాయి. పన్నేతర ఆదాయం మాత్రం ఆశించిన మేర లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 25 వేల 421 కోట్ల పన్నేతర ఆదాయం అంచనా వేయగా.. అక్టోబర్ నెలాఖరుకు అందులో కేవలం 34 శాతం మేర రూ. 8 వేల 796 కోట్లు మాత్రమే సమకూరాయి. గ్రాంట్లు చాలా తక్కువగానే ఉన్నాయి. వివిధ రూపాల్లో రూ. 41 వేల కోట్ల రూపాయలు గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేశారు. ఏడు నెలల్లో వచ్చిన గ్రాంట్లు కేవలం రూ. 5 వేల 592 కోట్లు మాత్రమే. బడ్జెట్ అంచనాల్లో ఇది కేవలం 13శాతం మాత్రమే.