REGISTRATION DEPT INCOME: రాష్ట్రంలో మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా రెట్టింపు అయ్యింది. గతంలో రోజుకు రూ.20 నుంచి రూ.25 కోట్లు మేర రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అది ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యింది. వాస్తవానికి గత ఆర్థిక ఏడాదిలో మొదటి మూడు నెలలు చాలా తక్కువ రిజిస్ట్రేషన్లు కావడంతో రాబడి కూడా బాగా తక్కువ వచ్చింది.
ఆ తరువాత మిగిలిన తొమ్మిది నెలలు రాబడులు అనూహ్యంగా పెరిగాయి. చివరి నాలుగు నెలలు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అయితే నెలకు రూ.12వందల కోట్లకు తక్కువ లేకుండా ఆదాయం వచ్చింది. మార్చి నెలలో అయితే ఏకంగా రూ. 1501 కోట్లు రాబడులు వచ్చాయి. దీంతో 2021-22 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యం రూ.12,600 కోట్లుకాగా 19.17లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అయ్యి రూ.12,373 కోట్లు మేర ఆదాయం వచ్చింది.
అంటే 98.98శాతం లక్ష్యం పూర్తి చేసి, నెలకు సగటున రూ.1,030 కోట్లు ఆదాయం వచ్చినట్లయింది. అంతకు ముందు ఏడాదిల్లో వచ్చిన ఆదాయాలతో పోలిస్తే తాజాగా రూ.30కోట్లకు తక్కువ లేకుండా రూ.50 కోట్లు అంతకు మించి రాబడి వస్తోంది. అయితే గత మార్చిలో ఏకంగా రూ.1501 కోట్లు రాబడి వచ్చింది. అంటే రోజుకు రూ.50కోట్లు తక్కువ లేకుండా రాబడి వచ్చింది.
ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.15,600 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మొత్తం అంతకు ముందు ఆర్థిక ఏడాది కంటే 20శాతం అధికంగా రూ.15,600 కోట్లుగా లక్ష్యాన్ని నిర్దేశించింది ప్రభుత్వం. అంటే ప్రతి నెల రూ.1,300 కోట్లు రాబడి వచ్చినట్లయితే నిర్దేశించిన లక్ష్యం పూర్తవుతందని అధికారులు అంచనా వేస్తున్నారు.