తెలంగాణ

telangana

ETV Bharat / state

Registrations Income: రిజిస్ట్రేషన్ల రాబడిలో దూకుడు.. 10 వేల కోట్ల దిశగా అడుగులు - Revenue from telangana registrations

Registrations Income: తెలంగాణలో ఛార్జీల పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రాబడి రూ.10 వేల కోట్ల దిశగా అడుగులేస్తోంది.

Registrations
Registrations

By

Published : Jan 15, 2022, 5:09 AM IST

Registrations Income: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రాబడి రూ.10 వేల కోట్ల దిశగా అడుగులేస్తోంది. ఛార్జీల పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి రెండో వారం నాటికి రూ.7,759 కోట్ల రాబడి వచ్చింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,151 కోట్లు రాగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ద్వారా రూ.6,608 కోట్లు వచ్చింది. ఇందులో గతనెల ఆదాయమే రూ.1,118 కోట్లు ఉంది.

ఈ క్రమంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ సగటున నెలకు రూ.1,000 కోట్లకు పైగా రాబడి ఉంటుందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మొదటిసారి రాష్ట్ర రిజిస్ట్రేషన్ల రాబడి రూ.10 వేల కోట్ల మార్కును ఈ ఆర్థిక సంవత్సరంలో దాటనుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,500 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది.

10 లక్షల రిజిస్ట్రేషన్లు...

అందులో జనవరి రెండో వారానికి 62 శాతం ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు సుమారు పది లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరంభంలో ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌ ప్రభావంతో సుమారు 50 రోజులు రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం పడింది. జూన్‌ నుంచి రిజిస్ట్రేషన్లు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం మార్కెట్‌ విలువలను సవరించడం వంటి పరిస్థితులు నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రస్తుతం సగటున రోజుకు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల రాబడి వస్తోంది.

రిజస్ట్రేషన్లకు ప్రాధాన్యం పెరిగి..

*పెట్టుబడులు, రియల్‌ ఎస్టేట్‌ దూకుడు నేపథ్యంలో భూములు, స్థలాలు, ఇళ్ల క్రయ విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు భారీగా పెరుగుతున్నాయి.

*భూముల విలువ పెరగడం, వ్యవసాయ భూములకు డిమాండ్‌ భారీగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ గతంలోలా కాకుండా రిజిస్ట్రేషన్లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటం, రిజిస్ట్రేషన్లు తహసీల్దార్‌ కార్యాలయాల్లో చేసుకునేలా సౌలభ్యం అందుబాటులోకి రావడం కూడా రిజిస్ట్రేషన్లు పెరిగేందుకు దోహదపడుతోంది.

*రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

*హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలతో పాటు వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ సహా వివిధ కొత్త జిల్లా కేంద్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ జోరందుకుంది. ఈ నేపథ్యంలో లావాదేవీలు పెరిగి రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి.

*రాజధాని శివార్లలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లలో 50 శాతం దాకా ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ మొత్తానికి రిజిస్ట్రేషన్లు జరుగుతుండటం గమనార్హం.

*2020-21 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల రాబడిని సర్కార్‌ అంచనా వేసి కరోనా, లాక్‌డౌన్‌ల ప్రభావం నేపథ్యంలో రూ.6000 కోట్లకు సవరించింది. రూ.5,243 కోట్ల రాబడి నమోదైంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details