రాష్ట్రంలో మద్యం ధరల పెంపుపై సీబీఐ విచారణ జరిపించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం చోరవ తీసుకుని తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మద్యం పెంపుపై తీవ్రంగా స్పందించిన రేవంత్రెడ్డి... ఆరు పేజీల బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో కల్వకుంట్ల అమ్మకపు పన్ను అమలవుతోందని... దేనిపై అయినా ఆరు శాతం మేర 'కేసీఆర్ అండ్-కో'కు ముట్ట చెప్పాల్సిందేనని ఆరోపించారు. మద్యం ధరల పెంపు వెనుక కూడా ఓ మాఫీయా హస్తం ఉందని ధ్వజమెత్తారు.
మద్యం ధరల వ్యవహారంలో ఓ ఎంపీ చెన్నై, దిల్లీలో మకాం వేసి బేరం కుదిర్చారని.. ఇది అత్యంత భారీ కుంభకోణమన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ శాఖ... ఎక్సైజ్ అండ్ ప్రోత్సాహక శాఖగా మారిందని మండిపడ్డారు. మద్యాన్ని ప్రోత్సహించడమంటే... మహిళల భద్రతలో రాజీ పడటమేనన్నారు. మద్యం అమ్మకాల్లో దోపిడి కోసమే ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 20కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తర్ప్రదేశ్లో కూడా మద్యం అదాయం ఇంతలేదన్నారు.
ఉత్పత్తి వ్యయం కంటే వెయ్యిశాతం అధిక ధరలు ఏలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన రేవంత్రెడ్డి... లాటరీ అనేది జూదమని నిషేధించిన ప్రభుత్వం అదే లాటరీ విధానంలో మద్యం దుకాణాలను ఏలా ఎంపిక చేస్తారని నిలదీశారు. దరఖాస్తుదారుడు చెల్లించిన రెండు లక్షల రూపాయలు... దుకాణం దక్కని వారికి తిరిగి ఇవ్వకపోవడం నేరమన్నారు. పెంచిన ధరలు తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు.