తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుకు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వాల కాలక్షేపం.. రణం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం' - రేవంత్‌రెడ్డి తాజా ట్వీట్

Revanthreddy Today Tweet: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తనదైన శైలిలో ట్విటర్‌లో ఇరు పార్టీల పాలనను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. రైతుకు భరోసా ఇవ్వకుండా రాజకీయ దాడులు, ప్రతి దాడులతో కాలక్షేపం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు కోసం రణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Revanthreddy
Revanthreddy

By

Published : Nov 20, 2022, 2:12 PM IST

Revanthreddy Today Tweet: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిత్యం నిప్పులు చెరుగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి భాజపా, తెరాస పాలనను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రభుత్వాలు రైతుకు భరోసా ఇవ్వకుండా రాజకీయ దాడులు, ప్రతి దాడులతో కాలక్షేపం చేస్తున్నాయని ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. అన్నదాతలకు అండగా ఉంటూ వారి పక్షాన రైతు రణం చేయడానికి కాంగ్రెస్ సిద్దమైందని రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, రైతు మిల్లర్ల మధ్య ఆరుగాలం శ్రమించి పంట పండించిన సాగుదారు నలిగిపోతున్నాడని పేర్కొన్నారు. రైతు తన కష్టాన్ని అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని ప్రస్తావించారు. వారి సమస్యల పరిష్కారానికి పార్టీ పక్షాన చిత్తశుద్ధితో పోరాడతామని రేవంత్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

తెలంగాణలో పోడు భూములు, ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్‌ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీ, అన్వేష్‌రెడ్డి, ప్రీతమ్‌, అయోధ్యరెడ్డి తదితరులతో కలిసి శనివారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాలి : రాష్ట్రంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న పోడు భూములు, ఇతర భూమి అంశాలు, ధరణి పోర్టల్‌, ఓబీసీ, ఈ ఏడాది వానాకాలం మార్కెటింగ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణ, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రకృతి విపత్తుల కారణంగా 15లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ భూములను సీలింగ్‌ ల్యాండ్ పేరిట ప్రభుత్వం పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా తెరాస, భాజపా నాటకాలాడుతున్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో కూడా నయీం కేసు, మాదక ద్రవ్యాల కేసు, ఆర్టీసీ కార్మికుల ధర్నా వంటి అంశాలను వివాదాస్పదం చేశారని గుర్తు చేశారు.

దశల వారీగా పోరాటాలు చాలా అవసరం : పశ్చిమ్‌బెంగాల్‌ తరహా రాజకీయాలు తెలంగాణలో కూడా చేయాలనుకుంటున్నారని ఆక్షేపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకం కింద 47లక్షల మందికి రూ.25వేల కోట్లు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ సీఎం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఇక నుంచి అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద రెండ్రోజులు దీక్ష చేపట్టాలని తెలిపారు. దశల వారీగా పోరాటాలు చాలా అవసరమని, వ్యవసాయం.. రైతుల అంశాలు ఇప్పుడు చాలా కీలకమని ఎంపీ ఉత్తమ్‌ ప్రస్తావించారు. తొలుత నియోజకవర్గాల్లో పోరాటాలు చేసి రైతులు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలు, డిమాండ్లపై సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించాలన్నారు. 32 జిల్లాల్లో ఆందోళనలు చేసిన తర్వాత గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పోరాటాలను చాలా కీలకంగా భావించి పని చేద్దామని పార్టీ నేతలు, శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details