Revanthreddy at Round Table Meeting on TSPSC :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్‌పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీని.. ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుందని ఆరోపించారు. సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో జరిగిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై.. నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
Revanthreddy fires on BRS : రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమించారని, గుమస్తా స్థాయిలేని వారు గ్రూప్-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి అర్హులను నియమించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆరోపించారు. నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే.. శాశ్వత నియామకాలు లేవన్న ఆయన ఈ నిర్లక్ష్యానికి కారణం సీఎం కేసీఆర్ కాదా? అని నిలదీశారు.
బోర్డు వైఫల్యాలపై, అవకతవకలపై ఐటీ మంత్రి అని చెప్పుకుంటున్న మంత్రి తారక రామారావు ఏం సమాధానం చెబుతారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తండ్రికి కాళేశ్వరం.. కుమారుడికి టీఎస్పీఎస్సీ.. కవితకు సింగరేణి ఏటీఎంలుగా మారాయని ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ అవకతవకల మూలాలు సీఎంవో అధికారులేనని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. గ్రూప్ 1 లీకేజీ కేసులో రాజశేఖర్‌రెడ్డి, లింగారెడ్డిలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
Round Table Meeting on TSPSC Paper Leakage : పేపర్ లీకేజి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు.. బోర్డును రద్దు చేయకుండా ప్రభుత్వం మొండిగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించిందని విమర్శించారు. సరైన విధానంలో పరీక్షలు నిర్వహించకపోవడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాల్సిన బాధ్యత సీఎం పై లేదా? అని రేవంత్ నిలదీశారు. టీఎస్పీఎస్సీ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయడంలేదని ప్రశ్నించారు.