RevanthReddy Comments at Jupalli House : పాలమూరు జిల్లా అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ జిల్లా అభివృద్ది కోసం జూపల్లి, గుర్నాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి గతంలో బీఆర్‌ఎస్‌లో చేరారని... తొమ్మిదేళ్లు గడిచినా కేసీఆర్ పాలమూరు జిల్లాను అభివృద్ది చేయలేదన్నారు. అందుకే వారంతా కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగరేశారని తెలిపారు. జూపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్‌రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి జూపల్లి కృష్ణారావు ఇంటికి వచ్చారు. మంచి ముహూర్తం చూసుకుని వారంతా కాంగ్రెస్‌లో చేరుతారని రేవంత్‌రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసం పార్టీలో చేరికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో 17పార్లమెంట్ స్థానాలు గెలిచిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా నేతలు కృషి చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.
'ఖమ్మం జిల్లా నేతలతో కూడా చర్చలు జరిపేందుకు వెళ్తున్నాం. పొంగులేటి, ఇతర నేతలను కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తాం. రాహుల్ గాంధీ విదేశాల నుంచి రాగానే పార్టీలో చేరికలు ఉంటాయి. జూపల్లిని సాదరంగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాం. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగితేనే బీఆర్ఎస్ను గద్దె దించగలం. ఇంకా చాలామంది కేసీఆర్ వైఖరిపై గళం విప్పుతున్నారు. అందరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం. అందరినీ కలుపుకుని, సలహాలు సూచనలు తీసుకుంటాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ సీట్లు గెలిచేలా కృషి చేస్తాం.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
Jupally Latest Comments : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిసిన అనంతరం ఆయనతో కలిసి జూపల్లి మీడియాతో మాట్లాడారు. పార్టీలోకి రావాలని కాంగ్రెస్ తనను ఆహ్వానించిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ ఆహ్వానంపై తమ నేతలతో చర్చిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్ కోల్పోయారని... అమరుల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తూ తెలంగాణను వ్యతిరేకించే వారితో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు ఏమైందన్న అయన... పైసల కోసమే కాళేశ్వరం నిర్మించారని జూపల్లి ఆరోపించారు.