Revanth Reddy fire on CM KCR: తెలంగాణకు చెందిన అమర జవాన్ యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం అన్యాయం చేయడంతో పాటు పరిహారం విషయంలో నిర్లక్ష్యం వహించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అమర జవాన్లు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా త్యాగంపట్ల వారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉందని... అయితే సీఎం కేసీఆర్ వ్యవహారశైలి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆయన సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
అమర జవానుల కుటుంబాల పట్ల సానుభూతి కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ ఆకాంక్షే అధికంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. అమర జవాన్ల మరణాలను సైతం సీఎం స్వార్థ రాజకీయాలకు వాడుకునే ఎత్తుగడ చూసి తెలంగాణ సమాజం విస్తుపోతోందని తెలిపారు. నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల మీకు సానుభూతి ఉంటే... తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం మీకు కనిపించలేదా... యాదయ్య త్యాగం మీకు యాదికి రాలేదా... అని ఆ లేఖలో సూటిగా ప్రశ్నించారు.