Revanth Reddy Letter to CM KCR : పత్తికి మద్దతు ధర కల్పించడంతో పాటు.. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎండనక, వాననక కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించకుండా దళారులు రైతులను దగా చేస్తుంటే.. అండగా నిలవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని రేవంత్రెడ్డి విమర్శించారు. పంట ఏదైనా వ్యాపారులు, దళారులు చెప్పిందే రేటు అన్నట్లుగా తయారయ్యిందని లేఖలో పేర్కొన్నారు.
పంటలకు కనీస మద్దరు ధర కావాలంటూ రైతులు రోడ్డెక్కితే.. ప్రభుత్వం నుంచి కనీసం స్పందనలేదని మండిపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల మధ్య రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే వారు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. సరైన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళికలు లేకపోవడం వల్లే.. రైతును సంక్షోభంలో పడేశాయని ధ్వజమెత్తారు.
రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానం: ఈ ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ నివేదిక ప్రకారం 2014 నుంచి 2021 వరకు రాష్ట్రంలో 6557 మంది రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు 11 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 512 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలిందని లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఈ తొమ్మిదేళ్లలో 7069 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి అన్నారు.