Revanth comments on TRS Plenary: అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. నేడు తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు జరుపుకొంటున్న తెరాసపై.. రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తెరాస అధినేత కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని రేవంత్ వ్యాఖ్యానించారు.
వైభోగం వెనుక విషాదం: నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుంచి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించిందని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మే 6న హనుమకొండలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ సందర్భంగా.. జిల్లాల్లో సన్నాహక సమావేశాలపై చర్చ సాగుతోంది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్‌తో రేవంత్ భేటీ అయ్యారు.