Revanth Tweet on Munugode By Poll Result: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా ఎగిరింది. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏకంగా డిపాజిట్‌నే కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమని తెలిపారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతతో పని చేసిన ప్రతి కార్యకర్తకు.. నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నానని రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు తొలిసారి అతితక్కువ ఓట్లు:2018 అసెంబ్లీ ఎన్నికల్లో 48.9 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 10.6 శాతానికి దిగజారింది. మునుగోడు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన 12 ఎన్నికల్లో 10 సార్లు కాంగ్రెస్ పోటీ చేయగా తొలిసారిగా అతి తక్కువ ఓట్లు వచ్చాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 97,239 ఓట్లు రాగా ఈసారి 23,906కు పరిమితమైంది.
నాడు స్వతంత్ర అభ్యర్థిగా 27,441 ఓట్లు:2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన స్రవంతికి 27,441 ఓట్లు రాగా ఈసారి కాంగ్రెస్ తరఫున బరిలో దిగగా 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి.