Revanth Reddy Tweet on Marri Janardhan Reddy Padayatra : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పాదయాత్ర చాటింపుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్రస్థాయిలో స్పందించారు. బోనం, బతుకమ్మతో వస్తే డబ్బులిస్తామని చాటింపు వేయడం ఏంటని ఎక్స్(Twitter) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవమని.. తెలంగాణ సంస్కృతికి సంకేతమని తెలిపారు. బోనం, బతుకమ్మతో వస్తే డబ్బులు ఇస్తామని చెప్పడం ఆత్మ గౌరవానికి వెలకట్టడమని.. ఇది బీఆర్ఎస్(BRS) నేతల అహంకారానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. ఇది తెలంగాణ సంస్కృతి విధ్వంసం.. బీఆర్ఎస్ పతనానికి సంకేతమని మండిపడ్డారు.
"బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవం. తెలంగాణ సంస్కృతికి సంకేతం. అలాంటి ఆత్మగౌరవానికి వెలకట్టడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి పరాకాష్ఠ. ఇది తెలంగాణ సంస్కృతి విధ్వంసం. బీఆర్ఎస్ పతనానికి సంకేతం."- రేవంత్ రెడ్డి, ట్వీట్
మరోవైపు.. హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గన్నేరువరం మండలానికి చెందిన బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారిని రేవంత్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Congress Women Leaders Angry With Marri Janardhan Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మహిళలను అవమానించి కించపరుస్తూ మాట్లాడారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మండిపడ్డారు. బతుకమ్మను అవమానించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బతుకమ్మ, బోనాలు ఎత్తితే హారతులు పడితే రూ.400 రేటు కడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు చాటింపు చేసి మహిళలకు డబ్బులు ఇస్తామంటూ ప్రచారం చేస్తారంటూ దుయ్యబట్టారు. కవితకు గౌరవం ఇస్తే అందరికి ఇచ్చినట్లేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేసిన పనికి కవిత ఎందుకు స్పందించడంలేదని ఆమె నిలదీశారు.
PCC Chamala Fires On BRS : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, బోనాలను బీఆర్ఎస్ రాజకీయ అవసరాల కోసం వెల కడుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బీఆర్ఎస్ తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గ్రామాల పర్యటనలో ఇది నిత్యకృతంగా కనిపిస్తుందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అక్రమ సంపాదనను ఎన్నికల్లో ఈ రకంగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. బోనం ఎత్తితే రూ.300.. బతుకమ్మ చేసుకుని వస్తే రూ.250.. హారతిపడితే రూ.400, ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొని డ్యాన్సులు చేస్తే బీరు బాటిల్ అంటూ గ్రామాల్లో చాటింపు వేయించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ను తరిమే రోజు దగ్గరలోనే ఉందన్నారు.