Revanth Reddy: మర్రి చెన్నారెడ్డి ఆదర్శాలతో టీపీసీసీ నిర్మాణాత్మక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. మర్రి చెన్నారెడ్డి జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉన్న ఆయన స్మారక కేంద్రంలో రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయనతో పాటు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, పీసీసీ కార్యదర్శి నిరంజన్ తదితరులు నివాళులర్పించారు.
ఆయన పోరాటం చిరస్మరణీయం..
తెలుగుదేశం హయాంలో మర్రి చెన్నారెడ్డి తన రాజకీయ చతురతతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆనాడే ప్రత్యేక తెలంగాణ కోసం మర్రి చెన్నారెడ్డి చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. మహిళలు, రైతులు, యువత సంక్షేమం, సాధికారతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో ప్రియాంక గాంధీ మహిళలకు 40శాతం సీట్లు కేటాయించడంతో మహిళల పట్ల కాంగ్రెస్కు ఉన్న మక్కువ స్పష్టమవుతోందన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా భాజపా అడ్డుకుంటోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు.