Revanth Reddy Angry On KTR: మంత్రి కేటీఆర్.. రూ.వేల కోట్ల ధనదాహంతో హైదరాబాద్ విశ్వ నగరాన్ని ధ్వంసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వాణిజ్య భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వని ప్రభుత్వం.. మంత్రి డెవలపర్స్ సంస్థకు 15 అంతస్తుల భవనానికి ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేబీఆర్ పార్క్‌ను ఎందరో ముఖ్యమంత్రులు కాపాడారని.. సినీ తారల నుంచి సామాన్యుల వరకు ఎందరో కేబీఆర్ పార్క్‌కు వెళుతూ ఉంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ కోసం గతంలో టెండర్లను పిలిచారని.. 2006లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని నిబంధనలు పాటించాలన్న షరతులతో అనుమతులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. ఈ టెండర్‌ను మూడు సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి దక్కించుకుని.. ఆ తర్వాత కాలంలో మంత్రి డెవలపర్స్ సంస్థ దీనిలో చేరిందని తెలిపారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2018లో మంత్రి డెవలపర్స్ సంస్థకు ఏడు అంతస్తులు కట్టుకునేందుకు అన్ని అనుమతులు ఇచ్చిందని మండిపడ్డారు. మళ్లీ ఆ తర్వాత అదే సంస్థ.. 12 అంతస్తుల కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తులు చేసుకుందన్నారు. 2022లో మరోసారి భూమి లోపల మూడు అంతస్తులు, భూమిపైన 12 అంతస్తులకు అనుమతులు కోరిందన్నారు. అప్పుడే ఆ సంస్థ జుట్టు మంత్రి కేటీఆర్ చేతికి చిక్కిందని అభిప్రాయపడ్డారు.