Congress Awareness Conference : ఈ ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ బోయినిపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో పార్టీ నేతలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ముందుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించగా.. ప్రముఖ కవి అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటతో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నేతలు కోదండరెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవితో పాటు నియోజకవర్గాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
Revanth Reddy in Congress Awareness Conference : భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్రంలో చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమ ప్రణాళికపై ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికారం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. విభజించి, పాలించి విధానంతో ముందుకెళ్తున్న భాజపా పరిపాలనకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ జోడో యాత్ర చేస్తున్నారని రేవంత్‌రెడ్డి, భట్టి తెలిపారు. రాహుల్‌గాంధీ సందేశాన్ని ప్రతి గడపకు చేరవేసి పార్టీ పటిష్టం చేసేందుకే హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి నడుంబిగించాలని పిలుపునిచ్చారు.
పీసీసీ వ్యతిరేక నేతలు హాజరు: ఈ శిక్షణా తరగతులకు పార్టీ పీఎసీ, పీఈసీ, అధికార ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోపాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని విభాగాల ఛైర్మన్‌లు హాజరయ్యారు. హాత్‌సే హాత్ జోడో అభియాన్‌తో పాటు ధరణి సమస్యలపై పోరాటం, ఎన్నికల నిబంధనలు, బీమా, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై ఈ సందర్భంగా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఈ శిక్షణా తరగతులకు సీనియర్లు హాజరవుతారా అనేది తొలి నుంచి ఉత్కంఠగా మారింది. అసంతృప్త నేతల్లో ఉన్న సీఎల్‌పీ నేత భట్టి, కోదండరెడ్డి శిక్షణా తరగతులకు హాజరుకాగా.. మిగతా వారు వివిధ కారణాలతో రాలేకపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.