Revanth Reddy Counter to KTR Legal Notices: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ.. రెేవంత్రెడ్డి, బండి సంజయ్‌లకు.. మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తనపై ఆరోపణలపై వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నోటీసులపై తాజాగా రేవంత్‌రెడ్డి స్పందించారు.
తనపై లీగల్ నోటీసును వెనక్కి తీసుకోకపోతే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత నెల 28న ఆయనకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ప్రతిగా రేవంత్‌రెడ్డి కేటీఆర్‌కు ఏడు పేజీల సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే మీ క్లయింట్ సరైన వివరాలు మీకు అందించలేదని కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియో సక్రమంగా వినినట్లు లేదని లేఖలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని.. ఈ దేశంలో లేనందున ఆ బాధ ఆయనకు తెలియదన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల విషయంలో.. నిరుద్యోగుల తరఫున మాట్లాడానని తెలిపారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీ శాఖ అందిస్తుందని అన్నారు. అలాంటప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందని వివరించారు.
కేటీఆర్ పరువు ఖరీదు రూ.100కోట్లా?:కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. మంత్రి ఉడుత బెదిరింపులకు భయపడేది లేదని పేర్కొన్నారు. లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడతానని వివరించారు. ఈ క్రమంలోనే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ పరువు ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తారని.. తనకు లీగల్ నోటీసు జారీ చేసినట్లు వచ్చిన వార్తను పత్రికల్లో చూసినట్లు పేర్కొన్నారు. ఆయన పరువు ఖరీదు రూ.100 కోట్లా అని ప్రశ్నించారు.