Revanth Reddy on Karnataka Results : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందడంతో రాష్ట్రంలోనూ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. పెద్దసంఖ్యలో గాంధీభవన్‌కు చేరుకున్న హస్తం కార్యకర్తలు, నాయకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కి.. రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
మత రాజకీయాలను తిరస్కరించారు : కాంగ్రెస్ మతాన్ని రాజకీయాలకు వాడుకోదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ బీజేపీ మత రాజకీయలతో కర్ణాటకలో అధికారంలోకి రావాలనుకుందని ఆరోపించారు. దీనిని అక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎత్తుగడలను ఓటర్లు చిత్తు చేశారని అన్నారు. జేడీఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూశారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేటీఆర్‌కు ఇష్టం లేదని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.
కర్ణాటక ఫలితాలు రాష్ట్రంపై ప్రభావితం చూపుతాయని రేవంత్‌రెడ్డి వివరించారు. వీటిపై రాహుల్‌గాంధీ జోడో యాత్ర ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. నిన్న హిమాచల్, నేడు కర్ణాటక, రేపు తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు అక్కడి ప్రజలకు నచ్చలేదని పేర్కొన్నారు. అదానీ అవినీతిపై మాట్లాడినందుకు ఆయనపై కక్ష కట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయి : ఇందులో భాగంగానే రాహుల్‌గాంధీ ఇంటిని ఖాళీ చేయించారని.. మరీ మాజీ ఎంపీ గులాంనబీ అజాద్ ఇళ్లు ఎందుకు ఖాళీ చేయించలేదని రెేవంత్రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. మోదీ ఓడిపోతే భారత్ రాష్ట్ర సమితి ఎందుకు బాధ పడుతోందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు భావిస్తున్నారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.