Revanth Reddy reaction on central budget 2023 : దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజాసంక్షేమం పట్టకుండా కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో గెలవాలన్న ప్రాతిపదికన కేటాయింపులు చేశారని.. దేశ ఆర్థికాభివృద్ధిపై ఎలాంటి స్పష్టత లేకుండా నిధులు కేటాయించారని మండిపడ్డారు.
బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చిన కేటాయింపులు చూశాక తీవ్ర నిరాశ ఆవహించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపిందన్నారు. విభజన హామీల అమలుకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కల్పిస్తామన్న హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని ఫైర్ అయ్యారు.
బడ్జెట్‌లో ఐటీఐఆర్ కారిడార్ ప్రస్తావనే లేదన్న రేవంత్ రెడ్డి... పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణకు జరిగిన అన్యాయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ దోషులే అని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన వాటిని కేసీఆర్ సాధించలేదని విమర్శించారు.
" బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. అసలు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు. తెలంగాణకు నిధులు ఇస్తారనుకుంటే నిరాశే ఎదురైంది. తెలంగాణకు జరిగిన అన్యాయంలో బీజేపీ , బీఆర్ఎస్ ఇద్దరూ దోషులే. తెలంగాణకు రావాల్సిన వాటిని కేసీఆర్ సాధించలేదు. - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు