Revanth Reddy Padayatra: రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరు నెలలపాటు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రపై.. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. పలువురు నాయకులు పాదయాత్రకు అనుకూలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పటికీ.. తాత్కాలికంగా ఆ విషయంపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు.. 126 రోజులపాటు పాదయాత్ర చేయడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు రేవంత్రెడ్డి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
అయితే ఈ విషయం తెలియగానే.. పలువురు సీనియర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాదయాత్ర నిర్వహించినట్లయితే అది ఒక వ్యక్తి ప్రచారంగా అవుతుందని అభ్యంతరాలు వెల్లడించారు. రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా ఈ విషయాన్ని పక్కన పెట్టారు. హాథ్‌సే హాథ్ జోడోఅభియాన్ యాత్ర మాత్రమే పరిమితమయ్యారు. అదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వారిపై వేటు తప్పదు: జనవరి 26వ తేదీన హాథ్‌సే హాథ్ జోడోఅభియాన్ యాత్రను లాంఛనంగా ప్రారంభించాలని పీసీసీ నిర్ణయించింది. ఆ తరువాత కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని.. ఫిబ్రవరి 6 నుంచి.. రెండు నెలలపాటు జోడో అభియాన్ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు రేవంత్రెడ్డి వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా రాహుల్ జోడో యాత్ర సందేశాన్ని.. ప్రతి గడపకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. వరుసగా మూడు సార్లు పీసీసీ సమావేశాలకు రాకుంటే వివరణ కోరతామని.. ముఖ్యమైన సమావేశాలకు గైర్హాజరైతే పార్టీపరంగా చర్యలు తప్పవని రేవంత్రెడ్డి హెచ్చరించారు.
తానెవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదు: మరోవైపు అంతకు ముందు విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. తానెవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తాను అధిష్ఠానం ప్రతినిధి అని తెలిపారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని వివరించారు.
అంతా ఐక్యంగా పని చేయాలి:హాథ్ సే హాథ్ జోడో యాత్రలో....రేవంత్రెడ్డి 50 నియోజక వర్గాలల్లో, మిగిలిన సీనియర్ నాయకులు 20 నుంచి 30 నియోజక వర్గాలల్లో పాల్గొంటారని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. పార్టీకి నష్టం కలిగించేట్లు మీడియాకు వెల్లొద్దని.. ఏ సమస్య వచ్చినా తనతో మాట్లాడొచ్చని నాయకులకు పిలుపునిచ్చారు. అంతా ఐక్యంగా పని చేస్తే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని మాణిక్ రావు ఠాక్రే అభిప్రాయపడ్డారు.