Revanth Reddy on Governor: రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గవర్నర్ వ్యవస్థ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఇక్కడి గవర్నర్‌ను అవమానిస్తోందని విమర్శించారు. ఆమెకు ప్రొటోకాల్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గవర్నర్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే దానిపై చర్చించవచ్చని.. రాజకీయంగా విభేదించవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో గవర్నర్‌కు ఉన్న విశేష అధికారాలు.. ఇతర గవర్నర్లకు లేవని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. విభజన చట్టం సెక్షన్ 8ని అమలు చేయడానికి విచక్షణ అధికారం ఆమెకు ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లితే .. మంత్రులుగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారని గుర్తు చేశారు. దీనిపై తాము ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. అప్పుడు ఆమె ప్రభుత్వానికి సహకరించారని.. ఇప్పుడు తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని అంటున్నారని రేవంత్‌రెడ్డి వివరించారు.
సీఎంలుగా ఉండి గవర్నర్‌ని ఎలా అవమానిస్తారు:ఖమ్మం బీఆర్ఎస్ సభలో గవర్నర్ వ్యవస్థపై సీఎంలు చేసిన విమర్శలను.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఖండించారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ స్థానానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవిని.. ముఖ్యమంత్రులు ఎలా నిర్లక్ష్యం చేస్తారని తమిళిసై ప్రశ్నించారు. రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఇప్పటివరకు.. ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం రాలేదని పేర్కొన్నారు. ఇది ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం కాదా అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేసీఆర్ స్పందించిన తర్వాతనే.. రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్తానని పేర్కొన్నారు.