తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఒకప్పుడు ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన విశ్వవిద్యాలయం నుంచే తెరాసపై దండయాత్ర చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 6న వరంగల్ రైతు సంఘర్షణ సభకు రానున్న రాహుల్ గాంధీని 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందుకోసం ఓయూ వీసీని కలిసి అనుమతి కోరడం, అక్కడ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావులకు పీసీసీ బాధ్యతను అప్పగించింది. అనుమతి కోరినా.. ఇప్పటి వరకు వీసీ అనుమతి ఇవ్వకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ముఖాముఖికి అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్:ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 7న విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. మానవతారాయ్ సహా నలుగురు పిటిషన్ దాఖలు చేయగా... హౌస్‌మోషన్ పిటిషన్‌గా తీసుకుని విచారణ జరపాలని కోరారు. ఇప్పటికే ఓయూ ఉపకులపతి అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ పెద్దల ఒత్తిడితోనే అనుమతివ్వడం లేదని ఆక్షేపిస్తున్నారు
గతంలో ఇలా.. వాస్తవానికి ఓయూ విశ్వవిద్యాలయంలో రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించరాదని హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది. 2016 జూన్ 4వ తేదీన తెలంగాణ జనజాతర సమావేశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఓయూలో విద్యా సంబంధ సమావేశాలు తప్ప, రాజకీయ సంబంధిత సమావేశాలకు వేదిక కారాదని హైకోర్టు జూన్ 5వ తేదీన స్పష్టం చేసింది. ఓయు కార్యనిర్వహక కౌన్సిల్ సైతం అక్కడ ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. మైకుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని కూడా తీర్మానం చేసింది. 2020లో చేసిన తీర్మానాలను చూపి ఓయూ అధికారులు రాహుల్ సభకు అనుమతి ఇవ్వకుండా దాటవేస్తున్నారు.
ఓయూలో వేడెక్కుతోన్న వాతావరణం:అయితే ఓయూలో సభకు వీసీ అనుమతి ఇవ్వక పోవడం వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2017లో ఓయూ దశాబ్ధి ఉత్సవాలు జరిగినప్పుడు హాజరైన సీఎం కేసీఆర్‌ను విద్యార్థులు అడ్డుకున్నారని, ఆ తర్వాత సీఎం ఓయూ వెళ్లలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉద్యమకాలంలో కేసీఆర్‌కు అండగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ.. రాష్ట్రం వచ్చాక అక్కడ పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. తెరాసకు ఇబ్బందిగా మారిన చోటకు కాంగ్రెస్‌ను అనుమతిస్తే తమకు ఇబ్బందని భావించిన కేసీఆర్.. అక్కడ రాహుల్ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఓయూ కేంద్రంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.