దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.వందల కోట్లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న దర్యాప్తు సంస్థలదేనని తెలిపారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
దిల్లీలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ సమగ్ర విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో వివిధ వ్యక్తుల ఇళ్లను సోదాలు చేసిన ఈడీ.. కేసీఆర్ కుటుంబీకుల నివాసాల్లో ఇంకా తనిఖీలు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ఈడీ ఆలస్యం చేయటం వల్ల ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందని తెలిపారు. కేసీఆర్, ఆయన కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు. వాసవి, సుమధుర, ఫీనిక్స్ గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ వీటికి సంబంధించి ఐటీ అధికారులు అధికారికంగా ఎందుకు వెల్లడించడంలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు భాజపా ఐటీ, ఈడీ దాడులు చేయించి ప్రతిపక్షాలను లొంగదీసుకుంటోందని రేవంత్ ఆరోపించారు.