టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కర్ణాటక కాంగ్రెస్ నేతలను కలిశారు. బెంగళూరులో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్‌లతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమను కలిసేందుకు వచ్చిన రేవంత్‌రెడ్డికి నేతలు శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను వారికి వివరించారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా నేతలను ఆహ్వానించారు. అంతకుముందు బెంగళూరులో కాంగ్రెస్ శ్రేణులు రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి.. శుభాకాంక్షలు తెలిపారు.
సిద్ధరామయ్య, మల్లికార్జున్ ఖర్గేలు కర్ణాటక రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. డీకే శివకుమార్ నాకు చాలా సన్నిహితమైన వ్యక్తి. ఈ నెల 7న నేను పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నా. పదవి చేపట్టే ముందు శివకుమార్ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నా. భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కార్యాచరణపై చర్చించాం. నేను పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి కర్ణాటక నేతలను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వచ్చాను. -రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
కర్ణాటక కాంగ్రెస్ నేతలను కలిసిన రేవంత్‌రెడ్డి.. అందుకోసమేనా!