ఆగస్టు 9నుంచి ప్రారంభమయ్యే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాలో ఒకరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తేదీ, స్థలం పార్టీ నేతలే నిర్ణయించాలని సూచించారు. హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో కార్యకర్తలు సామాజిక వర్గం, పార్టీ కోసం పనిచేసే వారే కావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్లో పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తనతో సహా ఎవరూ పాల్పడినా చర్యలుంటాయని రేవంత్ హెచ్చరించారు. కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దని హితవు పలికారు. బాధ్యతాయుతంగా పార్టీలో పనిచేస్తేనే గౌరవం పెరుగుతుందని చెప్పారు.
గోడపత్రిక ఆవిష్కరణ
ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరగబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ గోడపత్రికను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆగస్టు 11 నుంచి 21వరకు పది రోజులపాటు 5 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా ప్రతి రోజూ ఒక ప్రాంతంలో 2నుంచి 3 వేల మందితో ర్యాలీలు నిర్వహించాలని నాయకులకు సూచించారు. అదే విధంగా 7 సమావేశాలు నిర్వహించాలని.. మండలంలో ఉన్న మొత్తం ఓటర్లలో పదిశాతం మీటింగ్‌కు వచ్చేలా ప్రణాళిక చేయాలని వివరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అనుబంధ సంఘాల నాయకులను క్షేత్రస్థాయిలో పని చేయించాలని చెప్పారు. ఆదివాసీల జీవితాలు బాగుపడటానికి కాంగ్రెస్ మరో పోరాటానికి సిద్ధమైందని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ గిరిజన, ఆదివాసీ, దళిత వాడల్లో చూస్తే వాళ్ల జీవితాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో సీఎం కేసీఆర్ ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. వారి కోసం పోరాడటానికి, మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ మొదటివారంలో తెలంగాణకు రానున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులొచ్చినా ఇంద్రవెల్లి గడ్డ నుంచి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తాం. లక్షకు ఒక్కరు తక్కువైనా కేసీఆర్ వద్ద గులాంగిరీ చేస్తా. ప్రజలందరి మద్దతుతో దండోరాను విజయవంతం చేయాలి.
- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు