దేశంలో కరోనా టీకాల ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు రెండు పేజీల లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కొవిడ్ మహమ్మారికి వేలాది మంది బలవుతున్నారని, పట్టణాలు, నగరాలే కాదు... పల్లెలకు వ్యాప్తి చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యధిక మోతాదు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు భారత్‌లోనే ఉన్నాయని.. కానీ ఇప్పటి వరకు దేశంలో వ్యాక్సిన్ ఇచ్చింది కేవలం 3శాతం మందికేనని ఆయన పేర్కొన్నారు.
అతి తక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ల ఉత్పత్తి..
భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలు రెండూ కలిసి రోజుకు 30లక్షలు వ్యాక్సిన్లు మాత్రమే తయారు చేయగలవని.. 18 సంవత్సరాల వయస్సు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే... 2023 డిసెంబరు వరకు సమయం పడుతుందని రేవంత్ వివరించారు. ఈ ఏడాది మే 1 నాటికి భారత్‌లో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్కులు 59.5 కోట్ల మంది ఉన్నట్లు తెలిపారు.