killing of forest range officer Srinivas: ప్రభుత్వం చేతగాని తనంతోనే నిజాయితీ పరుడైన కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు.. గుత్తికోయల చేతిలో హత్యకు గురైయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. శ్రీనివాసరావు హత్య, పోడు భూముల వివాదంపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆయన.. ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి రావడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని ఇందుకు సీఎం బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణలో పచ్చని భూమిలో నెత్తురు పారుతోందన్న ఆయన.. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. అటవీశాఖ అధికారులు, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల మధ్య నిత్యం చిచ్చు రేగుతూనే ఉందన్నారు. ఎనిమిదేళ్లుగా పోడు భూములపై హక్కులు కల్పిస్తామని లబ్ధిదారులను ప్రభుత్వం ఊరిస్తూ వస్తోందని రేవంత్ విమర్శించారు.
అటవీ భూముల్లో సేద్యం చేస్తున్నారని గిరిజనులపైకి అధికారులను ఎగదోస్తూ చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి అధికారులు, గిరిజనుల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గత రెండు, మూడేళ్లుగా పోడు భూముల్లో అటవీ అధికార్లు మొక్కలు నాటేందుకు రావడం.. గిరిజనులు అడ్డుకోవడం.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగడం పరిపాటిగా మారిందన్నారు.