Revanth Reddy Comments On Governor: గవర్నర్ అచ్చం రాజకీయ నాయకురాలుగా మారారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు చాలా అధికాారాలున్నాయని వాటి ప్రకారం.. అందరూ అధికారులను ఆమె పిలిచి మాట్లాడవచ్చని తెలిపారు. సమీక్ష చేసి సస్పెండ్ చేసే అధికారం ఉంటుందన్నారు. డీవోపీటీకి సిఫారసు చేస్తే చాలు.. సీఎస్ మీద అయినా చర్యలు తీసుకోవచ్చని వివరించారు. గవర్నర్ మొన్ననే అసెంబ్లీలో ఎవరూ పొగడనంత ఎక్కువ పొగిడారని గుర్తుచేశారు.
ఈనెల 9న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సీఎంలను ఆహ్వానిస్తున్నామని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలను కరీంనగర్ సభకు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ పని అయిపోయిందన్న రేవంత్.. అందుకే బై బై కేసీఆర్ స్లోగన్ తీసుకున్నామన్నారు. 150 రోజులలో 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేస్తానని పేర్కొన్నారు.
ప్రజలతో మమేకమవుతూ సమస్యలను తెలుసుకుంటున్న రేవంత్: వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే సంక్షేమ ఫలాలు పేదలందరికీ అందుతాయని రేవంత్‌రెడ్డి అన్నారు. హాథ్ సే హాథ్ జూడో యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా మొగిలిపాలెంలో ఆయన పాదయాత్రను ప్రారంభించారు. గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
మల్లాపూర్లో మహిళలతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీ వద్దకు రావడం లేదా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. గెలిచిన తరువాత ఎమ్మెల్యే రసమయి గ్రామాల్లోకి రావడమే లేదని వారు సమాధానం చెప్పారు. దీంతో తమ సమస్యలు వినే వారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు బ్యాంకు నుంచి రావాల్సిన రుణాలు రావడం లేదని ఈ సందర్భంగా పలువురు మహిళలు వాపోయారు.