Revanth Reddy Interesting Comments: కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పీసీసీ పీఠంపై వేరొకరిని కూర్చోబెట్టినా తన భుజాలపై మోస్తానని పేర్కొన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. పార్టీ ఏం ఆదేశించినా సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని వివరించారు. పదవి ఉన్నా లేకున్నా కట్టుబడి పని చేస్తానని తెలిపారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏనాడు కేసీఆర్ నీడను కూడా తాకలేదు: కాంగ్రెస్ పార్టీ కోసం పదవుల్ని, ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమని రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేశానని పేర్కొన్నారు. ఎక్కడా ఉన్నా.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడానని గుర్తు చేశారు. ఏనాడు కేసీఆర్ నీడను కూడా తాకలేదని తెలిపారు. వందకు పైగా కేసులతో.. జైలులో పెట్టినా భయపడలేదని వివరించారు. 2003-04లో ఉన్న పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడతామని ప్రజలే విజ్ఞప్తి చేస్తున్నారని వెల్లడించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.
"పార్టీ శ్రేయస్సు కోసం అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తాను. పీసీసీ పీఠంపై వేరొకరిని కూర్చోబెట్టినా నా భుజాలపై మోస్తాను. పార్టీ శ్రేయస్సు కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. ఇందుకోసం పదవుల్ని, ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధం.2003-04లో ఉన్న పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి."- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ బోయినిపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో పార్టీ నేతలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. రాష్ట్రంలో చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. అధికారం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. విభజించి, పాలించి విధానంతో ముందుకెళ్తున్న బీజేపీ పరిపాలనకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ జోడో యాత్ర చేస్తున్నారని చెప్పారు.