Revanth Reddy Independence Day Speech : గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరంజాతీయ జెండాను అవిష్కరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 140 కోట్ల భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
TPCC Revanth Reddy Latest Speech : దేశ ప్రజలకు సాంతంత్య్ర ఫలాలు అందించాలనికాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రధానంగా ముగ్గురిని స్మరించుకోవాలన్నారు. అహింస మార్గంలో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీని.. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కును కల్పించిన అంబేడ్కర్‌ను.. కరవు-కాటకాలతో తల్లడిల్లుతున్న దేశానికి సంక్షేమ ఫలాలు అందించిన మహానేత నెహ్రూను స్మరించుకోవాలని గుర్తు చేశారు. వీరందరినీ తలచుకొని నివాళులు అర్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యులు బతకలేరు:ఈ క్రమంలోనే దేశంలో విభజించు.. పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటీష్ జనతా పార్టీ అవలంభిస్తోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విద్వేషాలను వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని వివరించారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 60 ఏళ్లలో చేసిన అప్పుల కంటే.. ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు అప్పు చేశారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని.. పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు.
విధ్వంసం అవుతుంటే ఓట్ల కోసం వెళ్లారు..: మణిపుర్ మండుతుంటే.. మోదీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని విమర్శించారు. మణిపుర్‌లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సిందిపోయి.. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈడీ, సీబీఐని పంపించారని ఆరోపించారు. దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ తాము అధికారంలోకి వస్తామనే భయంతో కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుంది అంటే అది కేవలం కాంగ్రెస్ వల్లే అని తెలిపారు.