Revanth Reddy Fires on KCR: కేసీఆర్ మోడల్ దేశానికి, రాష్ట్రానికి అత్యంత ప్రమాదమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీది కార్పొరేటర్ మోడల్ అయితే.. బీఆర్‌ఎస్‌ది మాఫియా మోడల్ అని విమర్శించారు. దేశంలోని పార్టీలకు వేల కోట్లు ఇస్తానని ముఖ్యమంత్రి బేరసారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో జేడీయూకు వందల కోట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భూ దోపిడీతో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భూ మాఫియా ద్వారా వచ్చిన సొమ్ముతో దేశ రాజకీయాలను ముఖ్యమంత్రి శాసించాలని చూస్తున్నారని విమర్శించారు. హెటిరో పార్థసారథి రెడ్డి సీఎంకు అత్యంత సన్నిహితుడని తెలిపారు. ఆయన ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అలాంటి పార్థసారథి రెడ్డి క్యాన్సర్ ఆసుపత్రికి భూములు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సాయి సింధు సంస్థకు హైటెక్ సిటీ దగ్గరలో 15 ఎకరాలు కేటాయించారని వెల్లడించారు.
ఇంతకంటే దోపీడీ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా?: అందుకు ఎకరానికి రూ. 33.70 కోట్లని రంగారెడ్డి కలెక్టర్ విలువ కట్టారని చెప్పారు. ఈ క్రమంలోనే సీఎస్ ఆసుపత్రికి 15 ఎకరాలు అక్కర్లేదని 10 ఎకరాలు చాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు. కానీ కొత్త జీవో ప్రకారం భూములు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని వివరించారు. వాస్తవానికి 15 ఎకరాలకు రూ. 1500 కోట్లు ఉంటే.. రూ. 505 కోట్లకు మాత్రమే ధర నిర్ణయించారని పేర్కొన్నారు. ఇంతకంటే దోపీడీ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి భూ దోపిడీని సీరియల్‌గా విడుదల చేస్తాం: ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలు కాదని కేసీఆర్.. పార్థసారథి రెడ్డికి చౌకగా భూములు కట్టబెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి భూ దోపిడీని సీరియల్‌గా విడుదల చేస్తామని అన్నారు. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లో దరిదాపుల్లోకి రాకుండా చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. దేశంలోని అన్ని పార్టీలకు ఆయనను వదిలించుకోవాలని లేఖ రాస్తామని చెప్పారు.