Congress Complaint Against 12 BRS MLAs: గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొంది.. ఏడాది గడవక ముందే అధికార పార్టీలో చేరిన 12 మంది శాసనసభ్యులపై మూడేళ్ల తర్వాత హస్తం పార్టీ చర్యలకు పట్టుబట్టింది. ఇందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల గెలిచింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయటం.. ఉపఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పోటీ చేసి ఓడిపోవటంతో కాంగ్రెస్ బలం 18కి తగ్గింది.
వీరిలో 12 మంది ఎమ్మెల్యేలైన.. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ,.. మహేశ్వరం శాసనసభ్యురాలు సబితాఇంద్రారెడ్డి, పాడేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,.. కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి,.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి.. 2019 జూన్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. అదే సమయలో సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని శాసన సభాపతికి లేఖ అందించారు.
తామూ ఇంప్లీడ్ అవుతామన్న కాంగ్రెస్: తాజాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయటం.. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించటంతో.. ఇందులో తామూ ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే తమ పార్టీలో గెలిచి.. పార్టీ మారిన 12మందిపై మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు నేతలు సమావేశమయ్యారు.
మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు:కాంగ్రెస్‌లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్లో చేరినందుకు.. వారికి కలిగిన రాజకీయ, ఆర్థిక లబ్ధిపై సవివరంగా ఫిర్యాదు చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం.. పార్టీ నేతలతో రేవంత్‌రెడ్డి మొయినాబాద్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర కేసు మొయినాబాద్‌లో నమోదు అయినందున.. అదే పోలీస్‌స్టేషన్‌లో ఈ 12మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిర్యాదు చేశారు.