Revanthreddy on BRS Leaders Joining in Congress : పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లు గడిచినా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Revanthreddy fires on Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరు జిల్లాలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వక్ఫ్ భూములు సైతం వదలకుండా అక్రమణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో అలంపూర్ నియోజకవర్గ అభివృద్ది శూన్యమన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లు అమ్మైనా జిల్లాను అభివృద్ది చేస్తానని చెప్పారని... ఇప్పుడు సీఎం అయినా జిల్లాను అభివృద్ది చేయడం లేదని దుయ్యబట్టారు. కానీ కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్.. కేటీఆర్‌కు వంద ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందని రేవంత్ ధ్వజమెత్తారు.
'9 ఏళ్లు గడిచినా కేసీఆర్ పాలమూరుకు చేసిందేం లేదు. జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూ కబ్జాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి శూన్యం. పాలమూరు జిల్లా కేసీఆర్ చేతిలో మోసపోయింది. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఏ దందాలో చూసినా బీఆరెస్ నేతలే. వాళ్ల అరాచకాలను ఎదిరించేందుకు ఇవాళ నేతలు కాంగ్రెస్‌లో చేరడం అభినందనీయం. మీ అందరికీ నేను అండగా ఉంటా. ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌ది.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ఛైర్మన్
అక్రమ కేసులు పెడితే మిత్తితో చెల్లిస్తాం : పాలమూరు జిల్లా కేసీఆర్ చేతిలో మోసపోయిందని... ఏ దందాలో చూసినా బీఆర్‌ఎస్ నేతలే ఉన్నారని పీసీసీ అధ్యక్షుడురేవంత్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు అధికారులు బీఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహారించోద్దన్నారు. అక్రమ కేసులు పెడితే మిత్తితో చెల్లిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుందామని తెలిపారు. ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపించాలని నేతలను కోరారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాధ అమర్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమరేందర్ రాజు, కౌన్సిలర్ రమాదేవి, పలువురు బీఆరెస్ నేతలకు రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవీ చదవండి :