కేంద్ర వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే ఈడీ దాడులని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్లదుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.
సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలవడం దారుణమన్న రేవంత్... సోనియాను ఈడీ విచారించడం మన తల్లిని అవమానించినట్లేనని తెలిపారు. సోనియాను అవమానిస్తుంటే మనం ఇంట్లో కూర్చుందామా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో కేంద్రం తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. మహిళలను అగౌరపరిచే దేశం నాశనమైపోతుందని అభిప్రాయపడ్డారు.