Revanth Comments on KTR: రైతు సమస్యను రాజకీయం చేయడంలో సీఎం కేసీఆర్ తీరిక లేకుండా ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతు పట్ల కాంగ్రెస్ నిబద్ధత కేటీఆర్‌కు తెలియకపోవడం బాధాకరమన్నారు. హరిత విప్లవం, వ్యవసాయ భూమి సీలింగ్ చట్టం, కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల చట్టం, ఉపాధి హామీ, సమగ్ర పంటల బీమా, ఆహార భద్రత.. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎవరి ఘనతని రేవంత్ ప్రశ్నించారు.
70 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని రేవంత్ అన్నారు. ఇక్రిశాట్ వంటి సంస్థల ఏర్పాటు, 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని గుర్తుచేశారు. భూసేకరణ చట్టం 2013 చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించిన రేవంత్.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయకుండా మహబూబ్‌నగర్ ప్రజలను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. అనంతరం దిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ నిబద్ధత కేటీఆర్‌కు తెలియకపోవడం బాధాకరం: రేవంత్ రెడ్డి
"దేశంలో రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నాణ్యమైన విత్తనాలను ఇక్రిశాట్ వంటి సంస్థలను భారత్‌కు పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది. రూ.1,259 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేసింది. రైతు కష్టాలు తీరకపోవడంతో యూపీఏ ప్రభుత్వం రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఆరోగ్యశ్రీ, నరేగా, ఆహారభద్రతా చట్టం తెచ్చింది. భూసేకరణ చట్టం 2013 చట్టాన్ని తెచ్చింది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసింది." -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు కూడా కాంగ్రెస్ ప్రోత్సాహకాలు ఇచ్చిందని రేవంత్ గుర్తుచేశారు. 36 లక్షల మంది రైతులకు రూ.5 వేల చొప్పున సాయం చేసిందన్నారు. అనేక ప్రాజెక్టులు చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయకుండా మహబూబ్‌నగర్ ప్రజలను తెరాస అరిగోస పెడుతోందని విమర్శించారు. ఐకేపీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరిస్తోందని.. రూ. పదివేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడం పెద్ద సమస్యేమీ కాదని రేవంత్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:Boiled Rice Issue : 'బాయిల్డ్ రైస్ కొనేదే లేదు'.. తేల్చి చెప్పిన కేంద్రం