REVANTH REDDY: సికింద్రాబాద్ ఘటనలో మృతి చెందిన రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం ఉద్రిక్తతలు రేపింది. వరంగల్‌కు వెళ్తున్న రేవంత్‌రెడ్డిని ఘట్‌కేసర్ టోల్‌గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేశ్ చావును వాడుకుని తెరాస శవరాజకీయాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అరెస్ట్‌తో ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొండా సురేఖతోపాటు కాంగ్రెస్ శ్రేణులు స్టేషన్ వద్దకు చేరుకుని రేవంత్‌రెడ్డిని విడుదల చేయాలని ఆందోళనకు దిగారు.
అనంతరం ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ నుంచి రేవంత్‌రెడ్డిని విడుదల చేశారు. రాష్ట్రంలో గందరగోళానికి మోదీ, కేసీఆర్ విధానాలే కారణమని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పోరాడతానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మరోపక్క వరంగల్ జిల్లా దబీర్‌పేటలో రాకేశ్ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే సీతక్కకు వ్యతిరేకంగా తెరాస శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో సీతక్కను పోలీసులు అడ్డుక్కొని వేరే చోటకు తరలించారు. ప్రజలపక్షాన పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ ఇతర వరంగల్ జిల్లా నాయకులను అరెస్టు చేయడం దారుణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. చావులకు, పరామర్శలకు వెళ్తున్న నేతలను ఎలా అరెస్టు చేస్తారంటూ ఆయన మండిపడ్డారు.